మార్గదర్శి!
విశాలపురిని విశాలాక్షుడు పాలించేవాడు. ఆయన గొప్ప దార్శనికుడు. అందువల్ల రాజ్యంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే సమర్థవంతంగా పరిష్కరించి మెప్పుపొందేవాడు.
విశాలాక్షుడి పాలనలో విశాలపురి ప్రజలకు ఏ లోటూ లేకుండా హాయిగా సాగిపోతున్న రోజులవి..హఠాత్తుగా రాజ్యంలో వర్షాలు కురిసి విష జ్వరాలు ప్రబలాయి. ప్రజలు వైద్యం అందక ప్రాణాలు కోల్పోసాగారు. ఇది గమనించిన విశాలాక్షుడు తీవ్ర కలత చెందాడు.
అదే సమయానికి ఓ భూత వైద్యుడు వచ్చి ‘‘ ఇది ఊర్లో వేపచెట్టు ఎండి పోయిన దోషం వల్ల వచ్చింది.. వెంటనే ఎల్లమ్మ తల్లికి పొంగళ్లు పెట్టి నైవేద్యంతో కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకోండి..’’ అంటూ ప్రజల్లో అశాస్త్రీయ భావనలు నూరిపోస్తున్నాడు. అందంతా విన్నాడు విశాలాక్షుడు.
మరుసటి రోజు వైద్యులను రప్పించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించాడు. జ్వరాలు ఎక్కువగా వున్న గ్రామాల్లో విపరీతమైన దోమలు వున్నాయని కనుక్కుని వాటి నివారణకు కృషి చేశాడు విశాలాక్షుడు.
అదే సమయానికి పక్క ఊర్లో భూతవైద్యుడు చేసే పనులను మారువేషంలో గమనించసాగాడు విశాలాక్షుడు. భూత వైద్యుడు చెప్పినట్లు ప్రజలు విలువైన బంగారు కానుకలు సమర్పించుకుంటున్నారు. హుండీ కానుకలన్నింటినీ సాయంత్రం మూటగట్టుకుని తీసుకెళుతున్నాడు భూత వైద్యుడు. అతను వచ్చిన విభూది పాలల్లో కలిపి తాగినా అదుపులోకి రాని జ్వరాలతో మోసపోయామని నెత్తీనోరు కొట్టుకుంటున్నారు ప్రజలు.
ఇది గమనించిన విశాలాక్షుడు మరుసటి రోజు రాజ్యంలోని భూత వైద్యులందరినీ పిలిపించి ప్రజలను మోసగించొద్దని కోరాడు. మారని భూత వైద్యులకు దేశ బహిష్కరణ శిక్ష విధించాడు.
విష జ్వరాలు ప్రబలిన ప్రాంతాల్లో తక్షణం వైద్యుల్ని నియమించి శిబిరాల ద్వారా వైద్యం అందించి ఆదుకున్నాడు విశాలాక్షుడు. రాజ్యంలో వైద్యంతో పాటు పారిశుధ్య పరిరక్షణ శరవేగంగా సాగింది. ఎన్నో రోజులుగా పీడిస్తున్న విష జ్వరాలు మటుమాయమయ్యాయి. విశాలాక్షుడి దార్శనికత్వాన్ని గ్రహించిన ప్రజలు అశాస్త్రీయ భావాలు వీడి క్లిష్టమైన వ్యాధులు వచ్చినప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ఆధునిక వైద్యులను సంప్రదించి జబ్బులను నయం చేసుకుని ఆనంద జీవనం గడపసాగారు. ప్రజలను ఆవరించిన మూఢ నమ్మకాల భూతం నుంచి మేల్కొలిపి కాపాడుతూ రాజు విశాలాక్షుడు మార్గదర్శకంగా పాలించసాగాడు.
– బోగా పురుషోత్తం, తుంబూరు,
