దొంగ ధర్మబుద్ధి!
పూర్వం ధర్మయ్య అనే ఓ దొంగ వుండేవాడు. అతనికి నల్గురు కొడుకులు వుండే వారు. వారిని బాగాచదివించి ప్రయోజకుల్ ని చేశాడు. వారిలో ఒకరు డాక్టరు అయ్యాడు. మూడవ వాడు ఇంజినీరు, నాల్గవ వాడు ఐసెస్ అధికారి అయ్యాడు. తన కొడుకులు ఉద్యోగాలు పొంది పెద్దహోదాలను పొందడం చూసి ధర్మయ్య ఆనందించేవాడు.
చిన్నప్పటి నుంచి అల్లరిచిల్లరిగా తిరుగుతూ చిన్నచిన్న దొంగతనాలకు అలవాటుపడటం మానుకోలేకపోయాడు. దీన్ని గమనిస్తున్న ప్రయోజకులైన తన కొడుకులు తండ్రి వద్దకు వెళ్లారు ” నాన్నా.. నీ ప్రవర్తన మాకు అపకీర్తి తెచ్చిపెడుతోంది..చెడు పనులు మానుకో..” అని హెచ్చరించారు. ఆ మాటలు విన్న ధర్మయ్య పకపక నవ్వి ” నేను చేస్తున్నది చెడు పని అయితే కదా? వదిలేయడానికి..”అని ఎదురు ప్రశ్న వేశాడు.
తండ్రి మాటలకు కొడుకులు ఆశ్చర్యపోయారు. ” నువ్వు చేస్తున్నది అధర్మపని..నువ్వు పోలీసులకు పట్టుబడినప్పుడల్లా మేము సమాజంలో తలెత్తుకు తిరగలేకపోతున్నాం.. వెంటనే నీ ప్రవర్తన మార్చుకో..” అని హెచ్చరించారు.
ధర్మయ్య దొంగతనం వదలలేదు. ఓ రోజు ధర్మయ్య బంధువుల పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఓ గదిలో నగలు ధరించిన ఇద్దరు మహిళలు కన్పించారు. ధర్మయ్య కన్ను వారి మెడలోని బంగారు హారంపై పడింది. వారినే అనుసరించాడు.
కొద్ది సేపటి తర్వాత మెళ్లోని నగలు బ్యాగులో దాచి స్నానానికి వెళ్లారు మహిళలు. సమయం చూసి ధర్మయ్య వారి గదిలోకి వెల్లి నగలు కాజేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి నెమ్మదిగా జారుకున్నాడు. మరుసటి రోజు ‘పెళ్లిలో నగలు చోరీ’ అనే శీర్షికన అన్ని దినపత్రికల్లో వార్త వచ్చింది.
బాధితుల ఫిర్యాదు మేరకు ధర్మయ్య కొడుకు పరమేశo రంగంలోకి దిగాడు.
పెళ్లి మండపంలోని సిసి కెమెరాలు పరిశీలించాడు. నగలు దొంగిలించిన తన తండ్రి ధర్మయ్యను అరెసు చేసి విచారించి కోర్టుకు తీసుకెళ్లాడు.
” నువ్వు చేస్తున్న దొంగపని మానుకోవా?” జడ్జి ప్రశ్నించాడు.
” నేను చేస్తున్నది దొంగపని అయితేనే కదా..మానుకోవడానికి?” అని ఎదురు ప్రశ్న వేశాడు ధర్మయ్య.
జడ్జికి కోపం వచ్చింది ” దొంగపని కాదని నిరూపిస్తావా?” జడ్జి ఆగ్రహించాడు.
” అవును ” తల ఊపాడు ధర్మయ్య. జడ్జి విచారణకు అనుమతించాడు. ఊరికి దూరంగా వున్న ప్రదేశంలో ఓ కుటీరం ఏర్పాటు చేసి వుంది. అందులో అనాథలు, కాళ్లు, చేతులు లేని వాళ్లు, కళ్లు లేని వాళ్లు ఆశ్రయం పొందుతున్నారు. పో
లీసులతో పాటు జడ్జి ఆ ప్రదేశానికి వెళ్లి చూశాడు. నిర్భాగ్యులైన వారు తమను ఆదుకునే ధర్మయ్య రావడం చూసి ఆనందంతో చేతులెత్తి నమస్కరించాడు. వారిని అప్యాయంగా పలకరించిన ధర్మయ్యకు లభిస్తున్న ఆదరణ చూసి జడ్జి ఆశ్చర్య పోయాడు.
” నేను దొంగిలిస్తున్న నగలు, డబ్బు అభాగ్యుల ఆశ్రమానికి ఖర్చుపెడుతున్నారు.. నా వ్యక్తిగత వినియోగానికి కాదు..” అన్నాడు ధర్మయ్య.
జడ్జి కాసేపు ఆలోచించాడు..” సమాజంలో దొంగతనం చేయడం నేరం.. అయితే నువ్వు దుర్బుద్ధి మాని నిస్వార్థంతో ప్రజా సేవ చేస్తున్నావు..ఇది మంచిదే..నిన్ను అభినందిస్తున్నాను.. కాని చాలా అన్యాయమార్గం అనుసరించడం అధర్మం..! పద్ధతి మార్చుకో.. న్యాయ మార్గంలో ధనం సంపాదించి అభాగ్యులను ఆదుకో..” అని సున్నితంగా మందలించి వదిలిపెట్టాడు.
తన తండ్రి చేస్తున్న సేవను చూసి నల్గురు కొడుకులు గర్వంగా భావించి అభినందించారు. అయితే దొంగతనం లాంటి అక్రమ మార్గాన్ని విడిచిపెట్టు.. నీకు కావాల్సిన ధనాన్ని మేము సాయం చేస్తాం..” అని హితవు పలికారు.
కుమారుల మాటలతో తండ్రి ధర్మయ్య అధర్మమార్గం విడిచి ధర్మమార్గం అనుసరించాడు. సమాజంలో ఉత్తమ సేవకుడిగా పేరు పొందాడు.
– బోగా పురుషోత్తం, తుంబూరు.
